Telangana : గ్రూప్‌-1 మెయిన్స్​ పరీక్షలో మార్పులు

-

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానంలో టీఎస్‌పీఎస్సీ సమూల మార్పులు చేసింది. ప్రశ్నపత్రంలో ఆప్షన్ల (ఛాయిస్‌)ను గణనీయంగా తగ్గించింది. ఇంటర్వ్యూల విధానం ఎత్తివేయడంతో అభ్యర్థుల సామర్థ్యాన్ని మరింతగా మదింపు చేసేందుకు కమిషన్‌ ఈసారి కొన్ని మార్పులు చేసింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు గతంలో అయిదు పేపర్లుండేవి. ఈసారి ఆరో పేపరును అదనంగా చేర్చారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులు కేటాయించింది.

పేపర్‌-1 (జనరల్‌ ఎస్సే)లో పెద్దగా మార్పుల్లేవు. పేపర్‌-2 (చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ), పేపర్‌-3 (భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన), పేపర్‌-4 (ఎకానమీ, డెవలప్‌మెంట్‌)లో ప్రశ్నలకు ఛాయిస్‌ను తగ్గించింది. ఇప్పుడు ఛాయిస్‌లతో కలిపి ఒక్కో సెక్షన్‌లో ఎనిమిది చొప్పున మొత్తం 24 ప్రశ్నలు మాత్రమే రానున్నాయి. ప్రతి సెక్షన్‌లో తొలి రెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్న అదనంగా ఇస్తారు. వీటిలో మాత్రమే ఛాయిస్‌ ఉంటుంది.

గతంలో పేపర్‌ – 4, 5 గా ఉన్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ సబ్జెక్టులను కలిపి ఈసారి పేపర్‌ – 5గా చేశారు. ప్రశ్నపత్రం పూర్తిగా మారింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాన్ని రెండు సెక్షన్లుగా ఇవ్వనున్నారు. ఒక్కో సెక్షన్‌లో పదేసి ప్రశ్నలుంటాయి. ప్రతి సెక్షన్‌లో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానమివ్వాలి. 3, 4, 5 ప్రశ్నలకు ఒక్కో అదనపు ప్రశ్న చొప్పున ఛాయిస్‌ ఉంటుంది. రెండు సెక్షన్లలో మొత్తం పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడో సెక్షన్‌.. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 30 ప్రశ్నలు వస్తాయి. 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

Read more RELATED
Recommended to you

Latest news