జైళ్లలో ఉన్న ఖైదీలు తమ అవయవాలను లేదా ఎముక మజ్జను దానంగా ఇస్తే.. వారి కారాగార శిక్ష వ్యవధిని తగ్గించడానికి అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఓ బిల్లును ప్రతిపాదించింది. ఆ బిల్లుపై ప్రస్తుతం పెను దుమారం రేగుతోంది. ఇది అనైతికమని, మూల్యం తీసుకొని అవయవాలను దానం చేయడాన్ని నిషేధించే ఫెడరల్ ప్రభుత్వ చట్టానికి విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. ఈ బిల్లు అవయవదాతల శిక్షాకాలాన్ని గరిష్ఠంగా ఏడాది వరకు మాత్రమే తగ్గిస్తుంది.
బిల్లు ప్రతిపాదనకు తలొగ్గి అవయవాలు దానం చేసే ఖైదీలకు ఆపైన జైలులో వైద్య సౌకర్యాలు అందడం పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడి జైళ్లలో ప్రస్తుతం నల్ల జాతీయులు, లాటినో జాతికి చెందిన ఖైదీలే ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రతిపాదిత బిల్లు అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కొత్త బిల్లును పాలక, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మసాచుసెట్స్ శాసనసభలో ప్రతిపాదిస్తున్నారు.