కాంగ్రెస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిందల్లా ఐకమత్యం, క్రమశిక్షణ, అంకితభావమేనని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఈ సమావేశాలు కొత్త కాంగ్రెస్‌కు ప్రారంభమని అన్నారు. ‘మన బలం పార్టీ బలంలోనే ఉంది. జాతీయ స్థాయిలో మన ప్రవర్తన ప్రభావం కోట్లాది మంది కార్యకర్తలపై పడుతుందని, సమయంతో పాటు ప్రజల ఆలోచనలు మారతాయన్నారు. కొత్త సవాళ్లు పుట్టుకొస్తాయి. అదే విధంగా కొత్త దారులు తెరుచుకుంటాయన్నారు ఖర్గే. అందుకే.. రాజకీయాలు, సామాజిక కార్యక్రమాలకు ముగింపు అనేది ఉండదంటారు. మనం ముందుకు సాగుతూనే ఉండాలని, మన తరంలో ఎంతో మంది ఈ దారిలో నడుస్తున్నారన్నారు. భవిష్యత్‌లోనూ నడుస్తూనే ఉంటారు. ఈ సమావేశాలు ముగుస్తుండొచ్చు. కానీ, ఇది కొత్త కాంగ్రెస్‌కు ప్రారంభం అని పేర్కొన్నారు ఖర్గే.
క్రమశిక్షణ, సంపూర్ణ ఐక్యతతో పనిచేసి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ దిశానిర్దేశం చేసింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేయడం ద్వారా 2024 లోక్‌సభ సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. రాయ్‌పూర్‌లో జరిగిన 85వ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ఐదు పాయింట్ల తీర్మానానికి ఆమోదముద్ర వేసింది కాంగ్రెస్. భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం, నిర్మాణాత్మక అభివృద్ధి వంటి భావజాలాలు ఉన్న పార్టీలతో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించింది.
“ఈ ఏడాది కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు క్రమశిక్షణతో పనిచేయాలి. ఐక్యంగా పనిచేసి విజయం సాధించాలి. ఈ ఎన్నికల ఫలితాలే కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బీజేపీ/ ఆరెస్సెస్ భావజాలంతో, వారి నీచ రాజకీయాలతో ఎన్నడూ రాజీ పడని పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. నియంతృత్వ, మతతత్వ, ఆశ్రిత పక్షపాతంతో కూడిన బీజేపీ నుంచి రాజకీయ విలువలను కాపాడేందుకు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం. ఇందుకోసం కలిసొచ్చే భావసారూప్యత పార్టీలతో పనిచేస్తాం. దేశం ఎదుర్కొంటున్న మూడు కీలక సమస్యలైన ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న సామాజిక విభజన, రాజకీయ నియంతృత్వానికి పరిష్కారం కనుగొనేందుకు సిద్ధంగా ఉన్నాం.”