బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షకు చేయనున్నారు. తామేమి తక్కువ కాదంటూ బీజేపీ కవిత దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్సీ కవిత దిల్లీలో మహిళా బిల్లు కోసం దీక్ష చేపడుతుండగా.. భాగ్యనగరంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు దీక్ష చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ బీజేపీ మోర్చ నేతలు దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతితో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే అరాచకాలకు నిరసనగా చేపట్టే ఈ దీక్షలో మహిళా నేతలంతా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగే దీక్షలో తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు దేశమంతా తెలియాలని బండి సంజయ్ పేర్కొన్నారు.