త్వరలో స్టాఫ్​నర్సుల పోస్టుల భర్తీ.. క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తం

-

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పేపర్‌ లీకైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. త్వరలో జరగనున్న స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీ విషయంలో జాగ్రత్తలు వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5204 స్టాఫ్‌ నర్సుల పోస్టుల కోసం 40,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే సిలబస్‌ను ప్రకటించగా పది రోజుల్లో రాత పరీక్ష తేదీలను వెల్లడించనున్నారు. వీటి ద్వారా స్టాఫ్‌నర్సుల ఎంపిక జరగనుంది.

రాత పరీక్ష నిర్వహణ, ఫలితాలను వెల్లడించి మెరిట్‌ జాబితాను అందచేసే బాధ్యతను రాష్ట్ర వైద్యఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూకు అప్పగించింది. రాత పరీక్ష నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ జేఎన్‌టీయూకు స్పష్టం చేయనుంది. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీల వ్యవహారం నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది.

రాతపరీక్ష కావడంతో పకడ్బందీ చర్యలు అవసరమని వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మే నెలల్లో స్టాఫ్‌నర్సుల ఎంపిక కోసం రాతపరీక్ష జరగనుంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షను నిర్వహించాలని వైద్యఆరోగ్యశాఖ జేఎన్‌టీయూకు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news