నేడు ఈపీఎఫ్‌ వడ్డీరేటు ఖరారు

-

ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఇవాళ ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటునే కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇవాళ సమావేశమవుతున్న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) అజెండాలో వడ్డీరేటు ఖరారు ప్రధాన అంశంగా ఉంది. అయితే వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అధిక పింఛనుపై సుప్రీంకోర్టు తీర్పు అమల్లో భాగంగా ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు విషయమై ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల్లో పలు సందేహాలున్నాయని, వాటికి పరిష్కారం చూపించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరారు. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితికి మించి అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, ఆ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు యజమానితో కలిసి పేరా నం.26(6) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చినవారే అర్హులన్న నిబంధనతో కార్మికులు నష్టపోతున్నారని వివరించారు. పేరా నం.26(6) కింద మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అధిక పింఛనుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా అమలు చేస్తున్నామని, ఏమైనా మార్పులు చేస్తే తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని కార్మికశాఖ, ఈపీఎఫ్‌ఓ ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news