తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న డి. శ్రీనివాస్ ఫ్యామిలీలో అనూహ్యంగా చిచ్చు రేగింది. ఫ్యామిలీలో రెండు పార్టీలు ఉండటమే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. అసలు డిఎస్ పక్కా కాంగ్రెస్ వాది దశాబ్దాల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో పిసిసి అధ్యక్షుడుగా పనిచేసి..పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. అయితే డిఎస్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు..ఆయన ఇద్దరు కుమారులు..సంజయ్, అరవింద్ సైతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత డిఎస్ కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్‌ఎస్ లోకి వచ్చారు..అలాగే రాజ్యసభ పదవి తీసుకున్నారు..అటు డిఎస్ తో పాటు సంజయ్ బిఆర్‌ఎస్ వైపు వచ్చారు. కానీ అరవింద్ బిజేపిలోకి వెళ్లారు. ఇక 2019 ఎన్నికల్లో అరవింద్ బిజేపి నుంచి పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. కవితని ఓడించారు. అలా అరవింద్ గెలవడం వెనుక డిఎస్ ఉన్నారని, బిఆర్‌ఎస్ ఆయన్ని పక్కన పెట్టింది. డిఎస్ , సంజయ్ బిఆర్‌ఎస్ పార్టీకి దూరమయ్యారు.
అప్పటినుంచి ఆయన కాంగ్రెస్ లో చేరాలని చూశారు..కానీ కొన్ని పరిణామాల వల్ల కుదరలేదు. కానీ తాజాగా తన తనయుడుతో సంజయ్ తో కలిపి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, మతిమరుపు ఉందని, ఆయనకు బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పారని అరవింద్ ఆరోపించారు.
దీని వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు డిఎస్ పేరిట లేఖ వచ్చింది. “ ఈ నెల 26న నా కుమారుడు డి.సంజయ్ కాగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్న సందర్భంగా ఆశీస్సులు అందజేయడానికే గాంధీభవన్‌కు వెళ్లాను. కానీ, నాకు కండువా కప్పి.. నేను పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే. అయితే ప్రస్తుతం నా వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నాను.” అని లేఖ వచ్చింది. ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దని..డిఎస్ భార్య ఓ వీడియో కూడా వదిలారు.
అయితే తనతోపాటు తన తండ్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరామని, తన తండ్రి కాంగ్రెస్ లో చేరడం ఇష్టంలేని తన తమ్ముడు అర్వింద్ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని ధర్మపురి సంజయ్ అన్నారు. ఇది బీజేపీ చేస్తున్న డ్రామా అని ఆరోపించారు. అంటే డిఎస్ ఇమేజ్ కాంగ్రెస్ కు వెళ్లకూడదని అరవింద్ ప్లాన్ చేసి ఇదంతా చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తానికి డిఎస్ ఫ్యామిలీలో మాత్రం చిచ్చు లేచింది.