టీడీపీ మద్దతు మీడియా దళిత వర్గాలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీకు చంద్రబాబు పై ప్రేమ ఉంటే వీరుడు, శూరుడు అని రాసుకోండి కానీ.. వైసీపీ ప్రభుత్వం పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దళితుల నుంచి భూమి లాక్కుని రామోజీ ఫిల్మ్ సిటీ కట్టిన వాళ్ళు దళితుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఒక ఎజెండా ప్రక్రారం టీడీపీ, వారి మద్దతు మీడియా వ్యవహరిస్తున్నాయన్నారు. మార్గదర్శి చేస్తున్న అక్రమాల పై సీఐడీ నోటీసులు ఇచ్చినందుకే ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఇది బరితెగింపు వైఖరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కుల రక్షణకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోనే స్పష్టం చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు సగటున ఏడాదికి దళితుల పై 2,107 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో సగటున 2, 011 కేసులు నమోదు అయ్యాయన్నారు.
దళితులు గా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అన్న చంద్రబాబును ఎవరు ఎందుకు ప్రశ్నించరు? అంటూ నిలదీశారు. జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో దళితులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనుకుంటే కోర్టుకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నాడని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టించాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు అడ్డుకున్నాడని.. కారంచేడు, చుండూరు లో దళితుల పై ఊచకోతలకు కారకులు ఎవరు? అని నిలదీశారు. పార్టీలో ఉంటూ పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరిపై అయినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉండవల్లి శ్రీదేవి టీడీపీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు మంత్రి ఆది మూలపు సురేష్.