కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ఇటీవలే రాహుల్ గాంధీ అనర్హత వేటుపై అమెరికా స్పందించింది. తాజాగా జర్మనీ కూడా ఈ విషయంపై తన స్పందన తెలియజేసింది.
‘‘భారత్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జైలు శిక్ష.. ఆ తీర్పు కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం. అయితే ఈ తీర్పుపై ఆయన అప్పీల్ చేసుకునే స్థితిలోనే ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా.. ఏ ప్రాతిపదికన ఆయనపై అనర్హత పడింది అనేది స్పష్టమవుతుంది. ఈ కేసుకు న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ భావిస్తోంది’’’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.