కేసీఆర్ పై ఒత్తిడి పెంచిన జగన్ నిర్ణయం.. ?

-

ఏపీలో సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయం తెలంగాణలోనూ ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ పై జగన్ నిర్ణయం ఒత్తిడి పెంచింది. అందుకే మంత్రివర్గంలో ఆర్టీసీపై గంటల తరబడి చర్చించారు. ఎట్టకేలకు ఆర్టీసీకి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. సంస్థ స్థితిగతులు, ఇతర అంశాలను సీఎం.. మంత్రివర్గ సభ్యులకు వెల్లడించారు. కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. కార్మికుల డిమాండ్లకు పరిష్కారం చూపడంతో పాటు అధికారుల కమిటీ నివేదిక ఇవ్వగానే సంస్థ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ సభ్యులుగా కమిటీని నియమిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ కమిటీ బుధవారం ఆర్టీసీ కార్మికులతో చర్చిస్తుంది. వారి డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత తొందరలో నివేదిక ఇస్తుందని, దానికి అనుగుణంగాచర్యలు చేపడదామని సీఎం వెల్లడించినట్లు తెలిసింది.

కార్మికులు తమ సమస్యలపై అధికారుల కమిటీతో చర్చించాలని మంత్రిమండలి సూచించింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని పేర్కొంది. అంటే దీని అర్థం తెలంగాణలోనూ ఆర్టీసీని ఏపీ తరహాలోనే విలీనం చేసేందుకు రంగం సిద్దమవుతున్నట్టే. అదే నిజమైతే.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కల నెరవేరినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news