హుజూర్‌న‌గ‌ర్‌లో వైసీపీ నేత‌ల ప్ర‌చారం… ఏం జ‌రిగింది…!

-

హుజూర్ నగర్ ఉపఎన్నిక పోరు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేసింది. అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హుజూర్ నగర్ స్థానాని కైవసం చేసుకునేందుకు స్కెచ్ లు వేస్తున్నారు. ముఖ్యంగా తమ కంచుకోటని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుంటే… ఎలాగైనా హుజూర్ నగర్ ని దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అటు కాంగ్రెస్-టీఆర్ఎస్ లకు పోటీ ఇచ్చేందుకు టీడీపీ-బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన పార్టీలు…ప్రచారంలో నిమగ్నమయ్యాయి.

అధికార టీఆర్ఎస్ తరుపున పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హుజూర్ నగర్ లో తిష్ట వేసి పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ ఓ సరికొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన వైసీపీ నేతల చేత ప్రచారం చేయించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ జగన్ మద్ధతు కోరినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే హుజూర్ నగర్ లో దివంగత వైఎస్సార్ అభిమానులు ఎక్కువ ఉన్నారు. అలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 27 వేల వరకు ఉన్నారు.

పైగా 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి దాదాపు 30 వేల ఓట్లు వరకు పడ్డాయి. ఆ పార్టీ అభ్య‌ర్థి గ‌ట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ త‌ర్వాత మూడో స్థానంలో ఉన్నారు. ఇప్ప‌ట‌కీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి బ‌లంగా మ‌ద్ద‌తుదారులు ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆంధ్రాబోర్డ‌ర్‌లో ఉండ‌డం కూడా ఇందుకు ఓ కార‌ణం. ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ తన స్నేహితుడు జగన్‌ను ఒప్పించి వైసీపీ నేతలని ప్రచారం బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

వైసీపీలోని రెడ్డి సామాజిక నేతలతో పాటు బీసీ,కాపు నేతల చేత కూడా ప్రచారం చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక్కడ బీసీ, కాపు ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. అందుకే వైసీపీ నేతలను సైతం ప్రచారానికి ఆహ్వానించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. మొత్తానికి హుజూర్ నగర్ లో తమ గెలుపుకు కలిసొచ్చే ఏ అవకాశాన్ని కేసీఆర్ వదులుకోవడం లేదు. చూడాలి మరి చివరికి కేసీఆర్ స్కెచ్ లు ఏ మేర విజయవంతమవుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news