‘తెలంగాణలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. చదువుకుని కార్మిక బలగంలో చేరాల్సిన యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2 శాతం పెరిగింది. గత ఏడాది జనవరి నాటికి 7.7 శాతంగా ఉన్న నిరుద్యోగం డిసెంబరు నాటికి 9.9 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో నిరుద్యోగ సగటు 7.2 శాతం కన్నా ఇది 2.7 శాతం అధికం’ అని కార్మిక బలగం సర్వే నివేదిక వెల్లడించింది.
తెలంగాణ కన్నా నిరుద్యోగిత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. ఈ జాబితాలో రాజస్థాన్, జమ్మూకశ్మీర్, బిహార్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక నిరుద్యోగ రేటు రాజస్థాన్ (13.7 శాతం)లో ఉండగా, గుజరాత్ (3.2శాతం)లో అతి తక్కువగా ఉంది. జాతీయస్థాయి సగటు 7.2 శాతంతో పోలిస్తే 13 రాష్ట్రాల్లో నిరుద్యోగిత ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారి నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగింది.