కెనడాలోని టొరొంటో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ చోరీ జరిగింది. రూ. కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో నిండిన కార్గో కంటైనర్‌ను దుండగులు అపహరించారు. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?
టొరంటో ఎయిర్‌పోర్టులో ఓ విమానం నుంచి దాదాపు ఆరు చదరపు అడుగులున్న ఓ కంటైనర్‌ను సోమవారం కిందకు దించారు. దానిలో సుమారు 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు ఉన్నట్లు సమాచారం. ఆ కంటైనర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో అదృశ్యం కావడం గమనార్హం. ఈ చోరీ వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. అయితే ఈ కంటైనర్ ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరు రవాణా చేశారో వంటి వివరాలేవీ వెల్లడించలేదు. ఘటన జరిగి మూడు రోజులు గడిచినా ఇప్పటి వరకు అనుమానితులెవరో తెలియలేదు.
కెనడా ఎయిర్‌పోర్టులో ఇంత భారీ చోరీ జరగడం ఇదే తొలిసారి కాదు. 1952లో టొరంటో ఎయిర్‌పోర్టులో అప్పట్లోనే 2.15 లక్షల డాలర్లు విలువైన బంగారం అపహరణకు గురైందని అధికారులు తెలిపారు.