మహారాష్ట్రలోని జబిందా మైదానంలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రజలకు సాగు, తాగునీరు సరిగా అందడం లేదని చెప్పారు. నీరు అందించని పాపం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ‘‘ముంబయి దేశ ఆర్థిక రాజధాని.. కానీ, తాగేందుకు నీళ్లుండవా? దేశం పురోగమిస్తోందా.. తిరోగమిస్తోందా? ఆలోచించండి. ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు.
ఇదంతా మన కళ్లముందే జరుగుతోంది. ఇది ఇలాగే జరగాలా.. చికిత్స చేయాలా.. చెప్పండి. నా మాటలు విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు వీధిలో ఉన్నవారందరితో చర్చించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎంత త్వరగా మేలుకుంటే.. దేశం అంత త్వరగా బాగుపడతామని కేసీఆర్ అన్నారు. ‘‘ సమస్యలకు పరిష్కారం లభించకుంటే ఏం చేయాలి? ఇంకెంతకాలం పరిష్కారం కోసం ఎదురు చూడాలి?ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా?’’ అని కేసీఆర్ మండిపడ్డారు. కాగా, సీఎం కేసీఆర్ పలువురు మరాఠా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారాస మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించడం ఇది మూడోసారి.