తన ప్రేమకథల గురించి, బెదిరింపుల గురించి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ మొదటిసారి స్పందించారు. తన మాజీ ప్రియురాళ్లు అందరూ మంచివారేనని.. తప్పు తన వైపు నుంచే ఉందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘‘మీ ప్రేమ కథలతో జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నా ప్రేమకథలన్నీ నాతోపాటే సమాధి అవుతాయి’’ అని సల్మాన్ బదులిచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో తనకు వస్తోన్న బెదిరింపులపై కూడా సల్మాన్ స్పందించారు. ‘‘అభద్రతతో జీవించే కంటే భద్రత మధ్య ఉండటం ఉత్తమం. అవును, బెదిరింపుల కారణంగా నాకు భద్రత పెంచారు. దీనివల్ల గతంలో మాదిరిగా ఒక్కడినే సైకిల్ రైడ్స్‌కు వెళ్లలేను. ట్రాఫిక్‌లోనూ నా వాహనం చుట్టూ భద్రతా బృందం ఉంటుంది. దీంతో వేరే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఏది జరగాలని ఉంటే.. అదే జరుగుతుంది. దేవుడిపై పూర్తి నమ్మకం ఉంచాను. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా’’ అని సల్మాన్ పేర్కొన్నారు.