బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఎంపీ అఫ్జల్ అన్సారీపై అనర్హత వేటు పడింది. కిడ్నాప్, హత్య కేసుల్లో నాలుగేళ్లు శిక్షపడటంతో అన్సారీపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 ఏప్రిల్ 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందంటూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో అఫ్జల్ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు దోషిగా తేల్చింది. అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, అఫ్జల్ అన్సారీ గాజిపుర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
మరోవైపు 17వ లోక్‌సభ రద్దుకు ఏడాదికి పైగా సమయం ఉండటం వల్ల సాంకేతికంగా గాజీపుర్ లోక్‌సభకు ఉపఎన్నిక నిర్వహించే అవకాశమైతే ఉంది. గాజీపుర్‌తో పాటు రాహుల్‌పై అనర్హత వేటు పడటం వల్ల కేరళలోని వయనాడ్, సిట్టింగ్ ఎంపీలు గిరీశ్ బాపట్ (భాజపా), సంతోక్ సింగ్ (కాంగ్రెస్)లు మరణించడం వల్ల పుణె, జలంధర్ లోక్‌సభ సీట్లు ఖాళీగా ఉన్నాయి.