రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి అనే నినాదంతో దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ అంతర్జాతీయ సంస్థలతో వరుసగా భేటీలు జరిపి వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చేశారు. అలా వేల కోట్ల పెట్టుబడులు.. లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని తీసుకువచ్చారు.
అయితే తాజాగా కేటీఆర్ మరో ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానం అందుకున్నారు. చైనాలోని టియాంజిన్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రపంచ ఆర్థిక వేదిక 14వ వార్షిక సదస్సు జూన్ 27 నుంచి 29 వరకు జరగనుంది. దీనికి హాజరుకావాలంటూ డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బార్గ్ బ్రెండె కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. తెలంగాణ రాష్ట్రం నూతన ప్రణాళికలతో, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోందంటూ అందులో ప్రశంసించారు.