తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల కోసం గీత కార్మికుల బీమాను అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… గీత కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటుపడాలని, ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు అందేలా చూడాలని సూచించారు. సోమవారం శాసనమండలి ప్రాంగణంలోని చైర్మన్ చాంబర్లో గీత కార్మికుల ఆర్ధిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. కుల వృత్తులకు పునర్ వైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రుణాలు, రాయితీలు ఇస్తూ వృత్తుల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
గీతకార్మికులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం తాటి మొదలుపన్ను రద్దు, రూ.5లక్షలకు బీమా పెంపు, నీరా కేఫ్, కల్లుదుకాణాలను తెరిపించి ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టిందన్నారు. వైన్స్ షాపుల్లో గౌడ్ లకు రిజర్వేషన్ సైతం అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.