పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అల్ ఖదీర్ ట్రస్టు భూముల కేసులో ఊరట లభించింది. ఎట్టకేలకు ఇస్లామాబాద్ హైకోర్టు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్‌కు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించింది. మే 9 తర్వాత ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన ఏ కేసులోనూ ఆయనను మే 17 వరకు అరెస్ట్ చేయవద్దని ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించినట్లు పాక్ మీడియా పేర్కొంది.
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు భారీ భద్రత మధ్య ఇమ్రాన్‌ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు రెండు గంటల పాటు విచారణ వాయిదా పడింది. ప్రతి శుక్రవారం చేసే ప్రత్యేక ప్రార్థనల అనంతరం విచారణను తిరిగి ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రారంభించింది. అయితే విచారణ అనంతరం పీటీఐ కార్యకర్తలను ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగిస్తారన్న వార్తల నేపథ్యంలో కోర్టు వద్దకు పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వల్ల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.