నాలుగు గంట‌ల్లోనే ప్రేమ‌.. పెళ్లి ఫినిష్‌

-

ప్రేమించుకోవ‌డం.. పెళ్లి చేసుకోవ‌డం… అంటే ఒక రోజులోనో… రెండు రోజుల్లోనే అయ్యే తంతు కాదు… నెల‌ల‌కు నెల‌లుగా… సంవ‌త్స‌రాల‌కు సంవ‌త్స‌రాలుగా ప్రేమించుకుని పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంటుంటారు. లేనిప‌క్షంలో పెద్ద‌ల‌కు సంబంధం లేకుండా కూడా పెళ్లి చేసుకునే జంట‌లు ఉంటాయి. కానీ ఓ యువతిని చూసీచూడగానే ప్రేమించేసిన యువకుడు, ఆమె కాళ్ల ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయగా, అతని నిజాయతీని నమ్మిన యువతి వెంటనే ఓకే చెప్పింది. ఇంకేముంది… ఆపై నాలుగు గంటల వ్యవధిలోనే పెళ్లి జరిగిపోయింది.

మ‌హా అయితే సినిమాల్లో మాత్ర‌మే ఇలా జ‌రుగుతూ ఉంటుంది. ఓ సినిమా మూడు గంట‌ల్లో ముగిసిపోయే వ్య‌వ‌హారం. కాస్త అటూ ఇటూగా సినిమాల్లో జ‌రిగిన‌ట్టుగానే మ‌రో గంట క‌లిపితే మొత్తం నాలుగు గంటల్లోనే ఈ ప్రేమ పెళ్లి తంతు ముగిసిపోయింది. ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీ వివరాల్లోకి వెళితే, కోల్‌ కతాలోని హింద్‌ మోటార్ ప్రాంతానికి చెందిన సుదీప్ ఘోషల్, షియోరాఫూలికి చెందిన ప్రతమా బెనర్జీలకు గడచిన మూడు నెలలుగా సోషల్ మీడియా ద్వారా పరిచయం కొనసాగుతోంది.

అస‌లు వీరిద్ద‌రికి ముఖ ప‌రిచ‌య‌మే లేదు. కేవ‌లం ఫేస్‌బుక్‌లో మాత్ర‌మే చాటింగ్ చేసుకుంటున్నారు. సుదీప్ ఫార్మాసూటికల్ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేస్తుండగా, ప్రతమా ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ద‌స‌రా సంద‌ర్భంగా వీరు క‌లుసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. దసరా సందర్భంగా ఓ పూజా మండపం వద్ద అనుకోకుండా వీరిద్దరూ కలిశారు. ఆమె కనబడగానే, మోకాళ్లపై కూర్చుని సుదీప్‌ ప్రపోజ్ చేశాడు.

సుదీప్‌లోని నిజాయితీ, అమాయ‌క‌త్వం చూసిన ప్రతమా, వెంటనే ఒప్పేసుకుంది. ఆపై వారి స్నేహితుల అండతో, రాత్రి 10:30 సమయంలో, స్థానిక కల్యాణ మండపంలో బాజాభజంత్రీలు మోగుతుండగా, దండలు మార్చుకున్నారు. ఈ పెళ్లిని వధూవరులిద్దరి తరపు కుటుంబాలు స్వాగతించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news