ఉక్రెయిన్​ రక్షణ కోసం అమెరికా పేట్రియాట్‌ వ్యవస్థ.. ధ్వంసం చేసేందుకు రష్యా యత్నం

-

ఉక్రెయిన్‌ రక్షణ కోసం అమెరికా పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను పంపిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్​తో యుద్ధం చేస్తున్న రష్యా.. అమెరికా పంపించిన పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇటీవల తీవ్రంగా యత్నించింది. ఇందుకోసం హైపర్‌సానిక్‌ క్షిపణలను కూడా ప్రయోగించి విఫలయత్నం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు వెల్లడించారు.

రష్యా ప్రయోగించిన ఈ క్షిపణులను ఉక్రెయిన్‌ పేట్రియాట్‌ వ్యవస్థను వాడి కూల్చేసింది. ఈ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్‌ దళాల చేతికి అందిన కొద్ది రోజుల్లోనే విజయవంతంగా వినియోగించిందని వెల్లడించారు. కీవ్‌ బయట మోహరించిన పేట్రియాట్‌ వ్యవస్థ నుంచి వెలువడిన ఓ సంకేతాన్ని రష్యా దళాలు పసిగట్టి వీటిపై కింజల్‌ హైపర్‌సానిక్‌ క్షిపణులను గురిపెట్టాయని అమెరికా వర్గాలు వెల్లడించాయి.

కానీ, పేట్రియాట్‌ వ్యవస్థకు సుదూర లక్ష్యాలను గుర్తించే రాడార్‌ ఉండటంతో ముప్పును ముందుగానే పసిగట్టింది. ఈ క్షిపణులను మైకలోవ్‌ ప్రాంతంలో పేట్రియాట్‌ ఇంటర్‌సెప్ట్‌ మిసైల్స్‌ అడ్డగించాయి. ఈ ఘటన మే 4న చోటు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news