మండుటెండలతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈనెల 29 వరకు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించిది. బుధవారం దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదైంది. అత్యధికంగా భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో 46.4, బయ్యారంలో 45.3, సూర్యాపేట జిల్లాలోని మామిళ్లగూడెంలో 45.2, నల్గొండలోని నిడమనూరులో 45.2, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మంగళవారం పగటిపూట రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 45.2 డిగ్రీలుండగా ఒక్కరోజులోనే మరో 1.2 డిగ్రీలు పెరిగి బుధవారం 46.4కి చేరడం తీవ్రతను కళ్లకుకడుతోంది. వడదెబ్బకు వేర్వేరుచోట్ల ఏడుగురు మృత్యువాత పడ్డారు. మెదక్, కుమురంభీం జిల్లాల్లో.. ఇద్దరు కూలీలు మరణించారు. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు.
సముద్రాలపై వేడి అధికంగా ఉంటున్నందున భూమధ్య రేఖ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలకు అనువైన వాతావరణం కనిపించడం లేదని తెలంగాణ వాతావరణ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగొద్దని ఆమె సూచించారు. దాహంగా అనిపించినా అనిపించకపోయినా గంటకోసారి నీళ్లు తాగాలని చెప్పారు.