తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ షెడ్యూల్‌ను ఈరోజు విడుదల చేసింది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది.
జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుండగా, జూన్ 26న ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇక జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
రెండో విడత కౌన్సెలింగ్ జులై 21 నుంచి మొదలవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ, జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలు పెడతారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు.