బిఆర్ఎస్ అవకాశవాద రాజకీయ పార్టీ అని విమర్శించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు కోదండ రెడ్డి. బిఆర్ఎస్ అవకాశవాద ప్రభుత్వమని మండిపడ్డారు. ధరణి పోర్టల్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు కోదండ రెడ్డి. ప్రభుత్వం ధరణిని అడ్డుపెట్టుకుని చేస్తున్న అక్రమాలపై కమిటీ వేశామన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వున్న రైతులను మభ్య పెట్టడానికి బిఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
తమకు అనుకూలంగా వున్న మనుషులతో ధరణి, భూములపై ప్రభుత్వం తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటుందని ఆరోపించారు. వర్షాల వలన తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని.. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మండిపడ్డారు కోదండ రెడ్డి. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ధరణి దందాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వలన 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. ధరణి వలన తాహశీల్ధార్ సజీవ దహనం అయ్యారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 15 లక్షల రైతుల భూములు ఆన్ లైన్ కు ఎక్కలేదన్నారు కోదండ రెడ్డి. ధరణి దేశంలో ఒక పెద్ద కుంభకోణంగా మారిందన్నారు. ధరణి ద్వారా బిఆర్ఎస్ నేతలకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు.