ఒడిశా రైలు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసినట్లు ప్రధాని మోదీ అన్నారు. చాలా రాష్ట్రాల ప్రజలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తక్షణమే స్పందించిన స్థానికులను ప్రధాని అభినందించారు.
రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై పర్యవేక్షించారు. రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోదీ కూడా ఒడిశా చేరుకున్నారు. ప్రమాద స్థలిలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరపడంతో పాటు కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.