ఒడిషాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సహాయక కార్యక్రమాలు, మరమ్మత్తులు తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనాస్థలిలోనే కేంద్ర మంత్రులు, అధికారులతో ప్రధాని రివ్యూ చేశారు. తర్వాత హెలికాఫ్టర్‌లో బాలసోర్‌కు చేరుకున్న ప్రధాని అక్కడి ఫకీర్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టును రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ ప్రధానికి అందజేశారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేలు అందించాలని ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో 278 మందికి పైగా చనిపోగా 1000 మంది వరకు గాయపడ్డారు.