ఈనెల 26 నుంచి రైతుబంధు నిధులు విడుదల

-

తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. వానాకాలం పంట(ఖరీఫ్‌) తాలూకూ రైతుబంధు నిధులను ఈ నెల 26 నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. గతంలో మాదిరిగానే అన్నదాతల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ చేయాలని సోమవారం రోజున సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న 65,00,588 మంది లబ్ధిదారులతోపాటు, కొత్తగా పోడు భూముల పట్టాలు పొందనున్న 1,50,012 మంది రైతులకూ రైతుబంధు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులకు సూచించారు.

ఈ నెల 24వ తేదీ నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం పట్టాలు పొందిన అందరికీ రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శనం చేశారు. 11వ విడత రైతుబంధు నిధుల విడుదలకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు హర్షం వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news