ఒబామాపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హెచ్చరిక హేతబద్ధంగా లేదని… ఇండియాలోనే మైనారిటీల హక్కుల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యం అని చెప్పారు. మానవ ప్రగతి విషయంలో, అక్కడక్కడా అలజడి, తాత్కాలిక అశాంతితో నిత్యం వార్తల్లో నిలిచే దక్షిణాసియాలో చాలా వరకు ప్రశాంతత నెలకొని ఉన్న దేశం ఇండియా. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా, 32,87,263 చ.కి.మీ సువిశాల భారతంలో మతపరమైన అల్ప సంఖ్యాకవర్గాల జనాభా 20 శాతం వరకూ ఉంది. అయినా, దాదాపు 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మత ఘర్షణలు మన పొరుగు దేశాల స్థాయిలో ఎన్నడూ జరగలేదని వెల్లడించారు.
ఒకవేళ జరిగినా కొద్ది రోజుల్లోనే మామూలు పరిస్థితులు నెలకొనే ఆనవాయితీ ఉంది. మతపరమైన అణచివేత కారణంగా సరిహద్దు దేశాల నుంచి మైనారిటీలు ఇండియాకు శరణార్ధులుగా తరలివస్తున్నారేగాని, ఈ కారణంతో దేశం నుంచి మైనారిటీలు ఎవరూ విదేశాలకు వలసపోయే పరిస్థితులు లేనేలేవన్నారు. మత సామరస్యానికి సంబంధించి ఇంత చక్కటి, ఆదర్శప్రాయమైన నేపథ్యం, చరిత్ర ఉన్న భారత్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు, అక్కడి మైనారిటీ ఆఫ్రికన్–అమెరికన్ (నల్లజాతి) వర్గానికి చెందిన తొలి నేతగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించిన బరాక్ ఒబామా నిన్న ఇండియాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.