తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. పండుగ ప్రత్యేక ప్రార్ధనల కోసం ఈద్గాలు, మసీదుల్లో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుందని అన్నారు. త్యాగాలద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్న సందేశాన్ని బక్రీద్ విశ్వ మానవాళికి అందిస్తుందని తెలిపారు.
త్యాగ స్ఫూర్తికి, అత్యున్నత భక్తికి బక్రీద్ ప్రతీక అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావం, సేవ, త్యాగం యొక్క స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. ప్రార్ధనలకు సుమారు 30వేల మంది హజరయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.