దేశంలోనే తొలిసారిగా.. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఔటర్ రింగ్ రైలు మార్గం రాబోతోంది. నగరం చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రైలు మార్గం నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఇప్పటికే ఆదేశించారని వెల్లడించారు. డీపీఆర్ రూపకల్పన కోసం స్థల నిర్ధారణ తుది సర్వే చేయడానికి రైల్వే శాఖ రూ.13.95 కోట్లను కేటాయించిందని ప్రకటించారు.
‘‘సర్వే విషయమై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. అవుటర్ రింగ్ రైలు మార్గాన్ని దేశంలోనే మొదటిసారి తెలంగాణలో చేపడుతున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ప్రాంతీయ బాహ్య రహదారి (ఆర్‌ఆర్‌ఆర్)కి వెలుపల సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలోని విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, మెదక్, కర్నూలు, ముంబయి, వికారాబాద్, కరీంనగర్‌ల నుంచి వచ్చే రైలు మార్గాలను అనుసంధానిస్తూ బైపాస్‌లు, ఆర్వోఆర్‌లతో (రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి) సాగే ఈ నిర్మాణంతో ఎక్కడికక్కడ నూతన జంక్షన్లు ఏర్పాటవుతాయి. నూతనంగా ఏర్పడే జంక్షన్ల సమీపంలోని పట్టణాలు, గ్రామాల ప్రజలకు నగరంలోకి రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుంది.” అని కిషన్ రెడ్డి తెలిపారు.