తిరుమలలో భక్తులు తప్పకుండా పాటించాల్సిన సంప్రదాయాలు ఇవే!!

-

తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి. పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి. శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి.

తొలి దర్శనం ఎవరిని చేసుకోవాలి?
శ్రీవేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి. ఈయననే శ్వేత వరాహస్వామి అంటారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలిపూజ, తొలి నైవేద్యం, తొలి దర్శనం జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తరువాత శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించడం శ్రేష్ఠం. అలా చేస్తేనే శ్రీవారికి ఇష్టమని, యాత్ర సఫలం అవుతుందని చెబుతారు.
-ఇక వీటితోపాటు తిరుమలలో ఎట్టిపరిస్థితుల్లోనూ పాదరక్షలతో నడువరాదు. మద్యం, మాంసం వంటి పదార్థాలను స్వీకరించరాదు.
– తిరుమలలో ప్రతి పువ్వు శ్రీవారి పూజకే అంకితం. కాబట్టి ఆడవారు ఎట్టిపరిస్థితుల్లో పూజకు ఉపయోగించే పూలను తలలో పెట్టుకోరాదు. నిర్మాల్యంగా తీసివేసిన పూలను మాత్రం తలలో పెట్టుకోవచ్చు.
– సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా, అరుపులు, వివాదాలు, గొడవలను పెట్టుకోరాదు.
– సాధ్యమైనంత వరకు మౌనంగా భగవన్నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి. అతి నిద్రకు దూరంగా ఉండాలి.

తిరుమల గురించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం…
తిరుమల క్షేత్రపాలకుడు
శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు సాక్షాత్తు పరమశివుడు. ఆయనే ఈ క్షేత్రంలో రుద్రుడుగా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు, గోగర్భంలో ఉంటూ మహాశివరాత్రికి అభిషేకాలు జరుపుకుంటున్నాడు.

బ్రహ్మపూజ.. బ్రహ్మతీర్థం
భక్త వరదుడైన తిరుమలేశునికి బంగారు వాకిళ్లు తెరవక ముందే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో (2.30 – 3 గంటలు) బ్రహ్మదేవుడు తొలిపూజ చేస్తాడు. అందుకోసమే ఆలయంలో బ్రహ్మపూజ కోసం పెద్ద బంగారు గిన్నెలో జలాన్ని, పళ్లెంలో చందనాన్ని ఉంచుతారు. ఆ తరువాత దాన్నే బ్రహ్మతీర్థంగా భక్తులకు ఇస్తారు. ప్రత్యేకంగా కన్యామాసం (తమిళ సంప్రదాయం)లో బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాడు.

తొలి హారతి
శ్రీవారి సుప్రభాతానంతరం స్వామివారికి మహంతు బావాజీవారి నవనీత హారతి తొలిగా సమర్పిస్తారు. శ్రీస్వామివారితో పాచికలాడిన పరమభక్తుడే ఈ మహంతు బావాజీ.

మేల్కొలుపు సేవ
ప్రతిరోజు శ్రీవారి సుప్రభాతంలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు బంగారు వాకిళ్ల దగ్గర నేటికీ మేల్కొలుపు పాటలు పాడుతూ స్వామివారిని మేల్కొలుపుతారు. అలాగే రాత్రి ఏకాంత సేవలో జోలపాట పాడుతూ స్వామివారి పవళింపు సేవలో పాల్గొంటున్నారు. నిత్యం జరిగే కళ్యాణోత్సవంలో తాళ్లపాక వారు నిత్య కన్యాదాతలుగా సత్కారం పొందుతున్నారు.

పుష్ప కైంకర్యం
శ్రీనివాసుడు పుష్పప్రియుడు. కొండ మీది పూలన్నీ స్వామివారి పూజకు మాత్రమే. ఇతరులు పుష్పాలు ఉపయోగించరాదు. అందుకే తిరుమలకు పుష్కర మండపం అని పేరు. వెయ్యేళ్లకు పూర్వం నుంచి ఆనందాళ్వారు శ్రీనివాసుని పుష్ప కైంకర్యంలో పాల్గొంటున్నారు. వీరు భగవద్రామాను జాచార్యులవారి శిష్యులు.

తీర్థ కైంకర్యం
ప్రతిరోజు శ్రీవారి భోగశ్రీనివాసమూర్తికి, ప్రతి శుక్రవారం మూలమూర్తికి ఆకాశగంగ తీర్థంతో అభిషేకం జరుగుతుంది. తిరుమలలోని ఆకాశగంగ తీర్థ జలాలను తెచ్చే కైంకర్యంలో సుమారు వెయ్యేళ్లుగా తిరుమలనంబి అనే వైష్ణవాచార్యుల వంశీయులు పాల్గొంటున్నారు. వీరు శ్రీరామానుజుల వారికి గురువులు. స్వయానా మేనమామ కూడా. శ్రీనివాసుడు వీరిని ఒక సందర్భంలో తాతా.. తాతా అన్నాడట. అందువల్లే తిరుమలనంబికి తిరుమల తాతాచార్యులు అనే పేరు వచ్చింది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news