విచిత్రం.. ఆ ఊళ్లో కోడి కూతే వినిపించదట..!

-

కోడి కూత.. పల్లెటూళ్లో ఇప్పటికీ ఇదే అలారం.. కోడికూతతో రామయ్య నిద్రలేచాడు. పొలానికి వెళ్లాడు అని చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం.. అయితే తెలంగాణలోని ఓ పల్లెలో మాత్రం అసలు కోడి కూతే వినిపించదట. ఆ గ్రామం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా.. అది వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం కంచిరావుపల్లి తండా.

మొత్తం 550 జనాభా ఉండే ఈ పల్లెటూళ్లో కోడి అన్న జంతువే కనిపించదు. ఇప్పుడే కాదు.. కొన్ని తరాల నుంచి ఇక్కడి వారు కోడిని చూడలేదట. ఎప్పుడైనా వేరే గ్రామం వెళ్లినప్పుడు చూడటమే తప్ప.. ఈ గ్రామంలో కోడి అన్నమాటే వినిపించదట. కోడి అనేదే లేనప్పుడు ఇక చికెన్ తినడం, కోడిగుడ్లు తినడం అన్నవి ఆ గ్రామంలో లేవని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.

అయితే ఇలాంటి వింతల వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుంది కదా..అలాంటిదే ఇక్కడా ఉంది. కొన్ని తరాలకు పూర్వం సోమనాథ్ బావుజీ అనే గురువు ఈ గ్రామానికి వచ్చినప్పుడు.. ఆయన వేసిన ఉమ్మిని ఓకోడి తిన్నదట. అప్పుడాయన ఇక్కడి ప్రజలు కోడి మాంసం, గుడ్లు.. కోడికి సంబంధించినవేవీ తినకూడదని ఆజ్ఞాపించారట. అప్పటి నుంచి ఈ గ్రామంలో అదే ఆచారం కొనసాగుతోందట.

అంతే కాదు.. ఈ గ్రామంలో చేపలు తినడం కూడా నిషేధమే. దీనికీ ఓ కారణం ఉంది. ఆ గురువు ఊళ్లో ఉన్న సమయంలోనే గ్రామస్తులు చేపలు వండుతుండగా కుండలో ఉన్న చేపలు బతికాయట. దీంతో గురువు వాటిని తినొద్దన్నారట. ఇంకో విచిత్రం ఏంటంటే.. కోడి, చేప కాకుండా మిగిలిన మేక, పొట్టేలు మాంసం తినడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. విచిత్రంగా ఉంది కదూ.

Read more RELATED
Recommended to you

Latest news