రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ముగిసింది. నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో, 302 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 84.75 శాతం పోలింగ్ నమోదైంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 1.21 శాతం తగ్గింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలో గుండ్లపల్లి, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి హుజూర్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఉప ఎన్నిక ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్ అన్ని టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేశాయి.
గత ఎన్నికల్లో ఇక్కడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేవలం 7 వేల ఓట్లతో విజయం సాధించగా… ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఆయనకు ఏకంగా 13 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. యేడాదిలోపు జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలవడంతో ఇప్పుడు తీర్పు ఎలా ఉంటుందా ? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీఆర్ఎస్ 50 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని చెప్పేశాయి. ఉప ఎన్నికలో ఒక్కొక్క మండలంలో ప్రజల తీర్పు ఒక్కోవిధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
పాలకవీడు, హుజూర్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చే అవకాశం ఉండగా, మిగిలిన మండలాల్లో టీఆర్‌ఎ్‌సవైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులు, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం పరిమితమేనని అంటున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు ట్రక్కు, రోలర్ గుర్తుపై ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో కూడా ట్రక్కు గుర్తుకు ఆరు వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ట్రక్కు గుర్తుకు రోడ్డు రోలర్ కూడా జతయ్యింది. ఈ గుర్తులు ఎన్ని ఓట్లను కొల్లగొడతాయనేది చర్చనీయాంశమైంది.
ఈ రెండు గుర్తులు కారు గుర్తుకు పడే ఓట్లు భారీగా చీల్చుకుంటే తమకు ప్లస్ అవుతాయని కాంగ్రెస్ వాళ్లు లెక్కలు వేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,36,842 ఉండగా పోలైన ఓట్లు 2,00,726 ఉన్నాయి. మరి ఈ 2 లక్షల ఓట్లలో నియోజకవర్గ ఓటరు ఎవరిని గెలిపిస్తాడో ? ఎవరిని ఓడిస్తాడో ? గురువారం తేలిపోనుంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో టీఆర్ఎస్ అప్పుడే సంబరాలు స్టార్ట్ చేసేసింది.