ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. కారుపైకి దూసుకొచ్చిన బండరాయి.. వీడియో వైరల్

-

నాగాలాండ్‌లోని చుమౌకేదిమా జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరగిపడటంతో ఓ పెద్ద బండరాయి రెండు కార్లపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

వర్షం కురుస్తుండటంతో నాగాలాండ్‌ లోని పకల్‌ పహర్‌ వద్ద వాహనాలు వరుసగా నిలిచిపోయాయి. అదే సమయంలో పక్కనే ఉన్న ఎత్తైన కొండపై నుంచి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో ఓ పెద్ద బండరాయి రహదారిపై ఉన్న వాహనాలపైకి దూసుకొచ్చింది. అక్కడ నిలిపి ఉన్న కారుపై పడటంతో అది నుజ్జునుజ్జయింది. ఆ తర్వాత ఆ రాయి దొర్లుకుంటూ పక్కనే ఉన్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో అదికూడా ధ్వంసమైంది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ప్రమాదానికి గురైన కార్ల వెనుక నిలిపి ఉంచిన వాహనాలకు అమర్చిన కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దుర్ఘటన గురించి తెలుసుకున్న నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news