సికింద్రాబాద్ మహంకాళి బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇవాళ రంగం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బోనాల వేడుకల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
‘ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నా. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచారు. కావాల్సిన బలాన్ని ఇచ్చాను.. మీవెంటే నేను ఉంటా. ఆలస్యమైనా వర్షాలు తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా. ఈ ఏడాది అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజలు, అధికారులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మీరేం భయపడొద్దు.. మిమ్మల్ని కాచుకుని నేనున్నా.’ అంటూ స్వర్ణలత.. మహంకాళి అమ్మవారి రూపంలో తెలంగాణ ప్రజల భవిష్యవాణి వినిపించారు.