పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటోలో చేరేందుకు స్వీడన్ విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే స్వీడన్ నాటోలో చేరేందుకు మొదటి నుంచి మోకాలడ్డుతున్న టర్కీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. నాటోలో ఆ దేశం చేరేందుకు అభ్యంతరం లేదని టర్కీ స్వీడన్‌కు తీపికబురు చెప్పింది. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ అంగీకారం తెలిపినట్లు నాటో అధినేత జెన్స్ స్టోల్తెన్‌బర్గ్ వెల్లడించారు. స్వీడన్ పెట్టుకున్న దరఖాస్తును టర్కీ అధ్యక్షుడు పార్లమెంట్ ఆమోదానికి పంపేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. లిథువేనియాలోని విల్నెయస్‌లో నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో స్వీడన్ చేరికకు టర్కీ అంగీకారం తెలిపిందని ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇదొక చరిత్రాత్మక విషయమని స్టోల్తెన్‌బర్గ్ పేర్కొన్నారు.
అయితే నాటోలో స్వీడన్ చేరాలంటే ఈయూలో టర్కీ చేరేందుకు అనుమతించాలని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ షరతు పెట్టారు. ‘టర్కీ కోసం మొదట ఈయూ తలుపులు తెరవండి. మీరు మాకు మార్గం సుగమం చేస్తే.. మేం స్వీడన్‌కూ నాటో సభ్యత్వానికి మార్గం సుగమం చేస్తాం’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎలాంటి షరతులు లేకుండానే ఎర్డోగాన్ స్వీడన్ చేరికకు ఒప్పుకున్నారు.