తమిళ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ ఐశ్వర్యలపై సైదాపేట కోర్టులో దాఖలైన కేసుని కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ధనుష్ నటించిన ‘వేలైయిల్లా పట్టదారి’ సినిమాలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్ధీకరణ చట్ట నిబంధనలు ఉల్లంఘించిన దృశ్యాలు చోటు చేసుకున్నాయని కోర్టులో పిల్ దాఖలైంది. ఈ సినిమాలో నటుడు ధనుష్ సిగరెట్ తాగే దృశ్యాలు వచ్చే సమయంలో తెరపై హెచ్చరిక వచనాలు సరిగ్గా కనిపించలేదని ఫిర్యాదు అందింది. కాబట్టి నిర్మాణ సంస్థ, ధనుష్‌పై చర్యలు చేపట్టాలని తమిళనాడు పొగాకు నియంత్రణ సంస్థ తరఫున ప్రభుత్వానికి ఫిర్యాదు వచ్చింది.
అనంతరం ఈ విషయమై విచారణ జరిపిన ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టరు సైదాపేట కోర్టులో ఐశ్వర్య, ధనుష్‌లపై కేసు దాఖలు చేశారు. అనంతరం ఈ కేసు సైదాపేట కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసును రద్దు చేయాలని ధనుష్, ఐశ్వర్య తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో కేసును కొట్టివేస్తూ జస్టిస్ ఆనంద వెంకటేశ్ సోమవారం తీర్పు ఇచ్చారు.