దిల్లీలో వర్షాలు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. ముఖ్యంగా యమునా నదిలో అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం అటు అధికారులను.. ఇటు ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. యమునా నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి, చరిత్రలో తొలిసారి నది నీటిమట్టం బుధవారం ఉదయానికే గరిష్ఠానికి చేరింది. అనేక కాలనీల్లోకి, మార్కెట్లలోకి వరద నీరు చేరింది.
దిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునానది నీటి మట్టం 208.05 మీటర్లకు చేరింది. ఎగువన ఉన్న హరియాణా నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా రెండు రోజుల క్రితమే నీటిమట్టం దానిని దాటిపోయింది. 207 మీటర్లను దాటడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. లోతట్టు ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో ప్రజలను ఖాళీ చేయించారు. వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా 144 సెక్షన్‌ను విధించారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతోపాటు నదిలో పూడిక పెరిగిపోవడం యమునలో నీటిమట్టం పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.