టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపాడు గ్రామంలోని రైతు వేదికలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి అసలు వ్యవసాయం అంటే తెలుసా..? ఆయన ఏనాడైనా వ్యవసాయం చేశాడా..? అని ప్రశ్నించారు. రైతు రాజ్యం అంటే కేవలం మాటల్లో కాక చేతుల్లో చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్తి అంధకారంలోకి నెట్టాలని చూస్తుందని, వారి పాలనలో ఏనాడు పగటిపూట కరెంట్ ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని.. రైతులందరూ బాగుంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు పరేషాన్ లో ఉన్నారని ధ్వజమెత్తారు.