తెలంగాణలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త డిజిటల్ కార్డులను అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించనుంది. ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) సాఫ్ట్వేర్ వినియోగానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుమతించింది. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం రోజున బోర్డు సమావేశం జరిగింది.
ఆరోగ్యశ్రీలో బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానం అమలులోకి తేవాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. కొత్త కార్డులను అందించేందుకు లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. కొవిడ్ సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ఫంగస్ సర్జరీలను నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు.