తెలంగాణలో రెండ్రోజుల నుంచి ఏకధాటి వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారుుల సూచించారు.
భారీ వర్షాల దృష్ట్యా సీనియర్ అధికారులు, కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లను అప్రమత్తం చేశారు.లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లు, మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని.. అవసరమైతే.. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.