ముంబయిలో భారీ వర్షం.. రాయ్​గఢ్​లో 86 మంది ఆచూకీ గల్లంతు

-

ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం, శివారులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా శాంతాక్రూజ్‌ ప్రాంతంలో 203.7 మి.మీల వర్షపాతం నమోదైంది. బాంద్రాలో 160.5 మి.మీలు, విద్యావిహార్‌లో 186 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.

మరోవైపు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. గ్రామంలో 229 మంది జనాభా ఉన్నారని.. అందులో 22 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. మరో 10 గాయపడ్డారని.. ఇంకో 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారని చెప్పారు. అయితే ఇంకా 86 మంది ఆచూకీ మాత్రం తెలియరాలేదని వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news