భారత్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారతాలను వరణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో దేశంలోని చెరువులు, నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. జలపాతాలు జలసవ్వడులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో జలపాతాలు చూడటానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొల్లూర్లోని అరశినగుండి జలపాతాన్ని చూడటానిరి శివమొగ్గ జిల్లా భద్రావతి ప్రాంతానికి చెందిన శరత్ కుమార్(23) కారులో వెళ్లాడు. జలపాతాన్ని వీక్షించేందుకు అక్కడ ఓ బండపై నిలబడగా.. దీనిని అతడి స్నేహితుడు ఫోనులో వీడియో తీశాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు శరత్. కాలు జారి పడిపోతున్న దృశ్యం మొబైల్లో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న కొల్లూర్ పీఎస్ఐ జయలక్ష్మి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. జలపాతంలో కొట్టుకుపోయిన శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొల్లుర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.