20 మంది ప్రయాణికులు మాత్రమే వెళ్లగలిగే.. పడవలో 50 మంది ప్రయాణికులు వెళ్లడంతో ఆ పడవ బోల్తా పడింది. ఈ ఘటన15 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో చోటుచేసుకుంది. సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించడంతో పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ బోటు ఆగ్నేయ సులవెసి ప్రావిన్స్‌లో లాంటో గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
చెక్కతో చేసిన ఈ బోటులో కేవలం 20 మంది ప్రయాణికులు మాత్రమే వెళ్లగలరు. కానీ, బోటు నిర్వాహకులు దాదాపు 50 మంది వరకు ప్రయాణికులను ఎక్కించడంతో ూయల్దేరిన కాసేపటికే పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 15 మంది మృతదేహాలను గుర్తించారు. నీటిలో పడిపోయిన ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడగా.. మరో 27 మంది ఈదుకుంటూ బయటకు రాగలిగారు. ఈ ప్రమాదం బోటు నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు.