రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉంటుందా? మునుగోడులో మొదలైన పొత్తు కొనసాగుతుందా? పొత్తు ఉంటే కేసిఆర్..కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం బాగానే ఉండేది. కొన్ని సీట్లు కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోయింది. సిపిఐ, సిపిఎం, పిడిఎఫ్ లాంటి పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకునే కెపాసిటీ కూడా లేదు.
కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు బలం ఉంది. గెలిచే బలం లేదు కానీ..గెలుపోటములని తారుమారు చేయగలవు. అయితే ఏజెన్సీల్లో కాంగ్రెస్‌కు పట్టు ఎక్కువ. ఇక కాంగ్రెస్‌ని నిలువరించాలంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్లాలనేది కేసిఆర్ ప్లాన్. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు..బిఆర్‌ఎస్‌కు బాగా ఉపయోగపడ్డారు. వారికి ఉండే 15-20 వేల ఓట్లు బిఆర్‌ఎస్‌కు కలిసొచ్చాయి. అందుకే 10 వేల ఓట్ల తేడాతో గెలవగలిగింది.
అయితే మునుగోడు ఉపఎన్నిక తర్వాత కమ్యూనిస్టులని కేసిఆర్ పట్టించుకోవడం లేదు. కమ్యూనిస్టులు సైతం తమ పని తాము చేసుకుంటున్నారు. ఇక కేసిఆర్..వాడుకుని వదిలేస్తారని, కాబట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలవాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. కానీ తాము ఇంకా కేసిఆర్ తోనే ఉన్నామని కమ్యూనిస్టులు అంటున్నారు. అటు కేసిఆర్ దగ్గర నుంచి స్పందన లేదు.
అసలు పొత్తు పెట్టుకుంటారో లేదో క్లారిటీ లేదు. పొత్తు ఉంటే ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియదు. కానీ తాజాగా సిపిఎం నేత బీవీ రాఘవులు మాత్రం తెలంగాణలో తమ పార్టీ 15-20 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. అంటే సిపిఐతో కలిసి అన్నీ స్థానాల్లో పోటీ చేస్తుందా? లేక సింగిల్ గా అన్నీ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారా? అనేది క్లారిటీ లేదు. అసలు కమ్యూనిస్టులు కలిసి ఉన్నా సరే కేసిఆర్ అన్నీ సీట్లు ఇవ్వరు. ఒకవేళ పొత్తు ఉంటే 4-5 సీట్లు ఇస్తారని ప్రచారం ఉంది. చూడాలి మరి కేసిఆర్..కమ్యూనిస్టులని కలుపుకుని వెళ్తారో లేదో.