నేడు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఐటీ జాబ్స్ వస్తే ఎందుకంత అక్కసు, కడుపుమంట అని ప్రతిపక్షాలను కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ప్రారంభించి మంచి మంచి కంపెనీలను తీసుకొచ్చాం అని కవిత తెలివెల్లడించారు. ఆ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మొత్తం కెపాసిటీ 750 ఉంటే.. ఇప్పటికే దాదాపు 280 మందికి కాల్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించి, వారి సమక్షంలోనే ఐటీ టవర్‌ను ప్రారంభించుకున్నాం అన్నారు ఆమె.
బీజేపీ ఎంపీ అరవింద్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తపరిచారు. నిజామాబాద్‌లో 2 లక్షల 77 వేల పెన్షన్లకు రూ. 4 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 2 లక్షల 59 వేల మంది రైతులకు రూ. 2,616 కోట్లు రైతుబంధు రూపంలో ఇచ్చాం. 4700 మంది రైతులు చనిపోతే రూ. 239 కోట్లు రైతుబీమా ఇచ్చాం. రూ. 2,800 కోట్లు రుణమాఫీ చేశాం. 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించగలిగింది. దీనికి రూ. 13 వేల కోట్లు చెల్లించింది ప్రభుత్వం. వీటన్నింటిలో బీజేపీ కంట్రిబ్యూషన్ ఏముంది..? అని నిలదీశారు కవిత. నిజామాబాద్‌కు ఇది కావాలని పార్లమెంట్‌లో ఒక్కనాడు కూడా ఎంపీ మాట్లాడలేదు.. కానీ పాలిటిక్స్ మాత్రం మాట్లాడుతారు. ఒక్కసారి కూడా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడలేదు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఐటీ జాబ్స్ వస్తే ఎందుకంత అక్కసు.. కడుపుమంట. పిల్లలు ఎప్పుడు మీ వెనుకాల జెండాలు పట్టుకొని తిరగలా..? అని కవిత పేర్కొన్నారు.