మణిపుర్‌లో మహిళలపై (Manipur Violence) చోటుచేసుకుంటున్న హింసాత్మక దాడులపై సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గంలో అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు, మూకలు లైంగిక దాడులను ఉపయోగిస్తారని తెలిపింది. ఇలాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని సూచించింది.
మణిపుర్ బాధితుల పునరావాసం, పరిహారం చెల్లింపు, కూల్చిన గృహాలు, ప్రార్థనా మందిరాల పునరుద్ధరణ తదితర చర్యలతోపాటు మే 4న తర్వాత మణిపుర్‌లో మహిళలపై జరిగిన లైంగిక దాడుల స్వభావంపైనా విచారణ జరపాలని ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన కమిటీని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. మహిళలపై లైంగిక నేరాలు, హింసాత్మక ఘటనలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. గుంపులో ఉండటం వల్ల శిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావించడంతోపాటు ఇతర కారణాల వల్ల ఆకతాయిలు మహిళలపై హింసకు పాల్పడుతుంటారని.. ఇటువంటి వాటిని నివారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆగస్టు 7న ఇచ్చిన ఈ తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.