సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను విక్రయిస్తున్న డీలర్లు ఇకపై మొబైల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బల్క్‌గా(ఎక్కువ సంఖ్యలో) సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రకటనలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొందరు సిమ్ కార్డుల డీలర్లు అక్రమంగా వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించాం. భవిష్యత్తులో అలాంటి వాటిని నియంత్రించనున్నాం అని అన్నారు.
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నట్లు తెలిపారు. వారు వెరిఫికేషన్ పూర్తి చేయడానికి తగిన సమయం ఇస్తున్నట్లు చెప్పారు.