జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కంటతడి పెట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్పోరేట్ పద్ధతిలో పల్లా కుట్రలు చేస్తున్నారన్నారు. ఏ రోజు కూడా జనగామ ప్రజలను ఆదుకోలేని వ్యక్తి ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారారన్నారు. తనకే టిక్కెట్ ఇస్తున్నారని ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. తనను ఓడించలేక తన ఇంట్లోనే చిచ్చుపెట్టారన్నారు.
కేసీఆర్ పిలుపు మేరకు 2002లో తాను తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నానన్నారు. తాను రెండుసార్లు జనగామ నుండి గెలిచానని, కానీ ఏడేళ్లుగా ఒక్కసారీ కనిపించలేదన్నారు. జనగామ నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన ఎంత ఎత్తు ఉన్నారో.. అంత పెద్ద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను డబ్బులు పెట్టి కొనే ప్రయత్నం చేస్తున్నట్లుగా గ్రామాల నుండి తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇది సరైన పద్ధతి కాదన్నారు.
జనగామ నియోజకవర్గం గురించి ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని డబ్బులతో జనగామను మరో హుజూరాబాద్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? అని నిలదీశారు. జనగామ టిక్కెట్ నీకు ఇచ్చినట్లు ఎలా చెబుతున్నావ్? ఇది పార్టీ నిబంధనలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత కొమ్మరి ప్రతాప్ రెడ్డి తనయుడు నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడో చెప్పాలన్నారు.
నా బిడ్డ చక్కటి అమ్మాయి అని, కానీ ఆమెకు నా గురించి ఏదేదో చెప్పి తనను టార్గెట్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారని మీకు తెలియదా? అన్నారు. 14 ఏళ్లుగా ఇక్కడి ప్రజలతో తాను మమేకమయ్యానని, కాబట్టి ఇక్కడే ఉంటానన్నారు. తనను, తన కేడర్‌ను పల్లా ఏడిపిస్తున్నారన్నారు. తన బిడ్డను బయటకు తీసుకు వచ్చి దుఖం తెప్పించారన్నారు. అయినప్పటికీ కేసీఆర్ సైనికుడిగా ఆయన ఏం చెబితే అలా చేస్తానన్నారు. ఈ సందర్భంగా తలవంచి నమస్కరించి.. కన్నీంటి పర్యంతమయ్యారు.