గతంలో పాలించిన ఏ ప్రభుత్వంతో పోల్చినా తాము మెరుగ్గా పాలిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోమవారం విజయవాడలో ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన మహాసభలకు హాజరయ్యారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులే వారధులని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేది ఉద్యోగులేనని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేశారని.. కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని గుర్తు చేశారు.
ఉద్యోగుల నియామకల్లోనూ నిబద్ధతతో వ్యవహరించామన్నారు సీఎం జగన్. 2019 నుండి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు జీతాలు పెంపొందించామన్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వివోలు, మెప్మా రీసెర్చ్ పర్సన్స్, శానిటేషన్ వర్కర్స్, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, హోంగార్డ్, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆయాలు ఇలా వీరందరి జీతాలు మనస్ఫూర్తిగా పెంచామన్నారు.